Slide show

[people][slideshow]

కనకధారా స్తోత్రం లోని వివిధ శ్లోకాల సంక్షిప్త భావం


(వందే వందారు...)భక్తుల కోర్కెలు తీర్చేవాడు, లక్ష్మీదేవికి ఆనందము కూర్చువాడు, జ్ఞానులకు ఆరాధ్యుడు అయిన హయగ్రీవునికి వందనము.
(అంగం హరే: పులక భూషణం ...)నీలమేఘశ్యాముడైన హరిని తన చూపులతో చుట్టివేసిన మంగళమూర్తి, సకలసిద్ధిస్వరూపిణి అయిన శ్రీలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములను ప్రసాదించును గాక !
(ముగ్ధా ముహుర్విదధతీ .. )కమలము చుట్టు పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక !
(విశ్వామరేంద్ర ...)దేవేంద్ర పదవిని సైతము ప్రసాదింపగలిగిన, ఎల్ల ఆనందములకును మూలమైన, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగింపగల శ్రీ మహాలక్ష్మీ మాత నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించు గాక !
(కాలాంబుదాళి...)విష్ణుమూర్తి నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !
(బాహ్యాంతరే మురజిత: ...) శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలము లోని కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడా ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !
(ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ...) శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు మన్మధునకు స్థానము కల్పించిన లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !
(దద్యాద్ దయానుపవనో ...)లక్ష్మీదేవి చల్లని చూపులు ఈ దరిద్రుడనెడి విచారగ్రస్తునిపై దయతో వాలి, ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !
(ఇష్టా విశిష్ట మతయో౭పి ...)ఆ తల్లి కరుణార్ద్ర దృష్టి వలన ఆశ్రితులైన పండితులకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించు గాక !
(గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ...)విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమ. 
(శ్రుత్యై నమో౭స్తు ...)శుభముల నొసంగు వేదమాతృ రూపురాలైన లక్ష్మీదేవికి, ఆనందగుణ సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు, నూర దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి, విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి దండములు.
(నమో౭స్తు నాళీక నిభాననాయై ...)పద్మము వంటి ముఖము గలిగినది, పాల కడలిలో జన్మించినది, అమృతమునకును చంద్రునికిని తోబుట్టువైనది, నారాయణునకు ప్రేమాస్పదురాలైనది అయిన లోకమాతకు దండములు.
(నమో౭స్తు హేమాంబుజ పీఠికాయై ...)బంగారు పద్మముపై ఆసీనయైనది, సమస్త భూమండలమునకు నాయిక అయినది, దేవాదులకు దయ జూపునది, శార్ఞ్గమను ధనుస్సును ధరించిన విష్ణుమూర్తికి ప్రియముకూర్చునది అయిన శ్రీ కమలాదేవికి దండములు.
(నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై ...)భృగుమహర్షి బిడ్డయైనది, విష్ణువు వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు దామోదరప్రియాదేవికి నమస్కారము.
(నమో౭స్తు కాంత్యై కమలేక్షణాయై ...)కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి, సకల భువనములకు తల్లియైనది, దేవాదులచే పూజింపఁబడునది, నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని ప్రేమను చూరగొన్నదియగు శ్రీదేవికి దండములు.

(సంపత్కరాణి ...)తల్లీ! మహాలక్ష్మీ ! మేము నీకుఁ జేయు వందనములు మాకు సంపదలను, సుఖములను గలిగించునవి.సామ్రాజ్యమును సైతము ప్రసాదింప జాలినవి. పాపములను హరించునవి. అవి నన్నెల్లప్పుడును వీడకుండును గాక !
(యత్కటాక్ష సముపాసనా విధి: ..)హే మహాలక్ష్మీ ! ఎవరి కటాక్షమును గోరుచు మనసా, వాచా, కర్మణా ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో, అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను.
(సరసిజ నయనే సరోజ హస్తే ...)కమలములవంటి కన్నులు గలది, కమలములు చేత ధరించినది, తెల్లని వలువలు, గంధము, పూలమాలలతో ప్రకాశించునది, సౌందర్యమూర్తి అయిన శ్రీమహాలక్ష్మీ! నీవు ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానవు. హే భగవతీ ! హరివల్లభా! శ్రీ మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము !

(దిగ్ దంతిభి: కనక కుంభ ముఖావసృష్ట ...)జననీ! సకలలోకాధినాధునకు గృహిణీ! క్షీర సముద్రరాజ పుత్రీ! దిగ్గజముల భార్యలు (అడు యేనుగులు) బంగారు కలశముల యందు పట్టి తెచ్చిన ఆకాశగంగ విమల జలములతో అనునిత్యమున్ను స్నానము చేయు జగజ్జననీ! శ్రీశ్రీ మహాలక్ష్మీ! నీకు ప్రాతఃకాలములో నమస్కరిస్తున్నాను.
(కమలే కమలాక్ష వల్లభే ... )అమ్మా ! కమలాదేవీ ! దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందఱి కంటే ముందు నేనే పాత్రుడనగుదును. నా మాటలలో నటన (కృత్రిమత్వము) లేదు. కనుక నీ కరుణాపూరిత కటాక్షముల (ఓరచూపుల)తో నన్నొకమారు చూడుము తల్లీ ! దేవీ ! ముకుందప్రియా !
(బిల్వాటవీ మధ్య లసత్సరోజే ...)మారేడు చెట్ల తోట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతినుండి జారవిడచుచున్నదియు నైన శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను.
(కమలాసన పాణినా ...)ధనికుల యిళ్ళ ముంగిట పడికాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుడు ఈ హీనజీవి యొక్క నుదుట వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచి వేయుమమ్మా! తల్లీ! శ్రీ మహాలక్ష్మీ !
(అంభోరుహం జన్మగృహం భవత్యా: ...)హే పద్మాలయా దేవీ ! నీ పుట్టినిల్లు కమలము. మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని దానిని నీ కేళీగృహముగా జేసికొనుము.
(స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం ...)వేదమాతయు, జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రతి దినమున్ను ఈ స్తోత్రము ద్వారా సేవింతురో, వారు తమ సద్గుణములచేత ఇతరుల కంటే అధికులై, విద్వాంసుల చేత గౌరవింపఁబడుచు మిక్కిలి సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు.

No comments:

vehicles

[cars][stack]

business

[business][grids]

health

[health][btop]